హైదరాబాద్(Hyderabad)లోని యూసఫ్‌గూడ(Yusufguda) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 24 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గాలి వేగంగా వీచడంతో కరెంటు వైర్లు తగిలి మంటలంటుకున్నాయి.
శ్రీపురం చౌరస్తాలోని ఫుట్ పాత్‌పై గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబ్బాలకు సోమవారం అర్ధరాత్రి గాలివేగంగా వీచడంతో కరెంట్ వైర్లు తగిలి మంటలంటుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో బెల్టుషాపు, ఫుట్‌వేర్ షాపు, పండ్ల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.3లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు ఆలస్యంగా స్పందించారు.
చివరికి ప్రైవేట్ ట్యాంకర్లతో మంటలు ఆర్పాల్సివచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయిందంటూ దుకాణదారులు వాపోతున్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.