ఢిల్లీ(Delhi)లోని షహదారా(Shahdara)లో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం కాగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
షాహదారా డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. స్ట్రీట్ నంబర్ 26లోని ఓ ఇంటి కింది అంతస్తులో వైపర్ రబ్బర్ కటింగ్ ఫ్యాక్టరీలో నడుస్తోంది. ఉన్నట్టుండి శనివారం తెల్లవారుజామున గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.
ఉదయం 6.55గంటల వరకు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఇంట్లోనే చిక్కుకున్న నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, 17 ఏళ్ల బాలుడు, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నాడు.
ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఇంటి నుంచి కొంతమందిని జీటీబీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదు.