మహారాష్ట్ర(Maharashtra)లోని హ్యాండ్ గ్లౌవ్స్ కర్మాగారం(Hand Gloves Factory)లో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వలుజ్‌లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరైన్ ఎంటర్ప్రైజెస్ హ్యాండ్ గ్లౌవ్స్ తయారీ కర్మాగారంలో సుమారు 25మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నైట్ షిఫ్ట్ చేస్తున్న 10 నుంచి 15 మంది ఉద్యోగులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో మంటలను గమనించిన కొందరు కార్మికులు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ పక్కన ఉన్న చెట్టు సాయంతో కిందకు దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. అయితే, మంటలు భారీగా ఎగిసిపడడంతో ఆరుగురు కార్మికులు బయటకురాలేక సజీవదహనమయ్యారు.
వారి మృతదేహాలను పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి శవపరీక్షల కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కర్మాగారం మొత్తం అగ్నికి ఆహుతైందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కొన్నిరోజుల క్రితం, కర్ణాటక-తమిళనాడులో సరిహద్దులో ఇదే తరహాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాణసంచా గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14మంది కార్మికులు సజీవ దహనమయ్యారు.