అమెరికా (America), న్యూయార్క్ (New York) సిటీలో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. హార్లెమ్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరగగా ఫాజిల్ ఖాన్(27) అనే భారతీయుడు మరణించాడని పేర్కొంది. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపింది.
న్యూయార్క్ అగ్ని మాపక విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. భవనంలోని ఆరో అంతస్తులో లిథియం-అయాన్ బ్యాటరీ వల్ల మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. దీంతో ఫాజిల్ ఖాన్ (fazil khan) మరణించడంతో పాటు 17 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అగ్ని మాపక విభాగం తెలిపింది.
మరోవైపు ఈ ప్రమాదం నుంచి మరికొందరు తప్పించుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ కి చెందిన ఫాజిల్ ఖాన్.. కొలంబియా యూనివర్సిటీ నుంచి 2020లో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ‘ది హెచింగర్ రిపోర్ట్’లో డేటా జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా ఫాజిల్ ఖాన్ మృత దేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ఆయన కుటుంబం సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం..