భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organisation) చరిత్రలో 2023 చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఈ సంవత్సరం చంద్రయాన్ 3 (Chandrayan), ఆదిత్య ఎల్1 ( Aditya) మిషన్లను విజయవంతం చేసి ప్రపంచ దేశాల దృష్టిని ఇస్రో (ISRO) ఆకర్షించింది. కాగా ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 శాటిలైట్ అంతరిక్ష ప్రయాణం సజావుగా సాగుతోంది. త్వరలో అది లాగ్రాంజ్ పాయింట్‌ను చేరుకోనుంది.
మరో వైపు ఈ రెండు ప్రయోగాలతో ఆగిపోని ఇస్రో.. మరో సంచలన మిషన్‌ను తెర మీదికి తీసుకొచ్చింది.. అదే గగన్‌యాన్. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్.. ప్రస్తుతం గగన్‌యాన్‌కు సంబంధించిన ప్రయోగాలు శరవేగంగా సాగుతున్నాయి. తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద గల లిక్విడ్ ప్రొపల్షన్ రీసెర్చ్ సెంటర్లో రాకెట్ ఇంజిన్ సీఈ-20ని 720 సెకెండ్ల పాటు మండించింది అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ టెస్ట్ విజయవంతంమైనట్టు కూడా తెలిపింది.
మరికొద్ది రోజుల్లో గగన్‌యాన్ మిషన్‌ను ప్రయోగించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అత్యున్నత స్థాయి సమక్ష సమావేశాన్ని నిర్వహంచారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వారు మోదీకి గగన్‌యాన్ మిషన్ వివరాలను వివరించారు.
2025 నాటికి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారికి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను నెలకొల్పాలని, మొట్ట మొదటి భారతీయుడిని 2040 నాటికి చంద్రునిపైకి పంపించాలని సూచించారు. అలాంటి ప్రతిష్ఠాత్మక మిషన్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు గగన్‌యాన్ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తరువాత మానవ సహిత మిషన్‌ను చేపట్టిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.