దేశాన్ని, దేశ ప్రజలను రక్షించే సైనికులకి ఎన్ని కష్టాలు ఉంటాయో ఊహించడం కష్టం. ఎండ, వాన (rain), చలి, మంచు వీటిని తట్టుకొని, తమ ప్రాణాలు పణంగా పెట్టి.. దేశం కోసం త్యాగం చేసే మహోన్నత వ్యక్తులు సైనికులు.. ఇలాంటి వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడాలంటే అష్టకష్టాలు పడవలసిందే. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో (Jammu Kashmir)ని సియాచెన్ (Siachen) ప్రాంతలో..
ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న యుద్ధ క్ష్రేత్రం.. సరైన ప్రాణవాయువు కూడా లేని ఈ ప్రాంతంలో భారత సైనికులు దేశ రక్షణ విధులు నిర్వహించడం పెద్ద సాహసమే.. అయితే ఈ ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు సరిగా లేకపోవడం వల్ల కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు సైనికులకు కష్టమయ్యేది. ఈ కష్టాలను తీర్చేలా మొట్టమొదటి మొబైల్ కమ్యూనికేషన్ (Mobile Communication) టవర్ తాజాగా ఇక్కడ ఏర్పాటు చేశారు.
కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవుసింహ్ చౌహాన్ ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఈ ఫోటోలను తన ఫాలోవర్లతో పంచుకున్నారు. నిత్యం అల్లకల్లోలంగా ఉండే ప్రపంచంలో ఇది ఓ చిన్న ఘటనే కానీ దేశ రక్షణ కోసం ప్రతిరోజు ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులకు ఎంతో గొప్ప క్షణం.. విక్రమ్ ల్యాండర్ కంటే ముఖ్యమైన ఈ చిన్న పరికరం వారి పాలిట వరం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నన్నడిగితే ఇది నిజంగా చాలా పెద్ద వార్త అని కామెంట్ చేశారు.