దేశ ప్రజలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట (Consecration) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆ రోజు ప్రతి హిందువు, ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఆ రోజున ఐదు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరారు.
ఈ ఏడాదిలో చివరిదైన మన్ కీ బాత్ 108వ ఎడిషన్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ….. రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం జరగాలని 500 ఏండ్లుగా అనేక మంది పోరాటం చేశారని తెలిపారు. ఆ పోరాటంలో చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారన్నారు. ఇప్పుడు యావత్ ప్రపంచంలోని హిందువులు జనవరి 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రోజు దేశంలోని ప్రతి హిందువు ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొవాలన్నారు. వర్చువల్గా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా ప్రతి హిందువు తిలకించాలని కోరారు. స్వామి వారి మహా హారతిలో పాల్గొని శ్రీరాముడి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నానని వెల్లడించారు.
తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. 2024 సంవత్సరం అనేది దేశానికి అత్యంత ముఖ్యమైన సంవత్సరం అని తెలిపారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని చె్ప్పారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని, దేశ ప్రతిష్టను పెంచేలా అనేక చర్యలు చేపడుతూ, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు మోడీ ప్రభుత్వం చేపడుతోందన్నారు.