– గ్రామాల్లో దళిత బంధు చిచ్చు
– మూడు భాగాలుగా విడిపోయిన గ్రామం
– ఓ కాలనీకే పథకం అమలు
– మిగిలిన 2 కాలనీలు ఏం పాపం చేశాయి?
– దళిత బంధు బీఆర్ఎస్ వాళ్లకేనా?
– అన్యాయం చేసిన అధికార పార్టీ వాళ్లను..
– వెలి వేస్తున్నామన్న గ్రామస్తులు
ఎన్నికలు సమీపిస్తున్నాయి.. త్వరలో షెడ్యూల్ కూడా రానుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు రాష్ట్రంలో పర్యటించి వెళ్లారు. ఇలాంటి సమయంలో అధికార బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపు అసంతృప్త నేతలు పార్టీని వీడుతుంటే.. ఇంకోవైపు గ్రామాల్లో వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఎక్కడిక్కడే బీఆర్ఎస్ నేతలకు ప్రవేశం లేదనో, గ్రామంలోకి రావొద్దనో.. ఇలా ఏదో నిరసన వ్యక్తం అవుతోంది. తాజాగా ఖమ్మం (Khammam) జిల్లాలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
కేసీఆర్ (KCR) ఎంతో ప్రతిష్టాత్మకం తీసుకొచ్చిన దళిత బంధు పథకం ఎంపిక విషయంలో వివక్ష చూపుతున్నారంటూ.. బీఆర్ఎస్ (BRS) నాయకులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైరా మండలం సిరిపురం గ్రామస్తులు. రాజుపేట కాలనీకి చెందిన దళితులను మాత్రమే పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని.. ఇదే గ్రామంలో ఉంటున్న మరో రెండు కాలనీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన వారికి, వారి అనుచరులకు మాత్రమే దళిత బంధు ఇస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ పథకాలపై ఇలాంటి వివక్ష ఎందుకు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఒకే గ్రామంలో ఉన్న కాలనీలను విడదీసి తమ మధ్య చిచ్చు పెడుతున్నారని ఫ్లెక్సీలో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన మూడు కాలనీల్లోకి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారులు రావొద్దని పేర్కొన్నారు. తమ గ్రామాన్ని మూడు ముక్కలు చేశారని వాపోయారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, వారి వర్గానికి చెందిన నాయకులు అందరూ కలసి అత్యంత రహస్యంగా ఉద్దేశ్యపూర్వకంగా సిరిపురం గ్రామాన్ని విడదీసే దళితబంధు చిచ్చు పెట్టారని మండిపడ్డారు.
ఇప్పటిదాకా ఒకటిగా కలిసి ఉన్న గ్రామాన్ని సిరిపురం కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాజుపేట కాలనీలుగా విడగొట్టారని ఆరోపించారు గ్రామస్తులు. పథకాన్ని కేవలం రాజుపేట కాలనీ వారికే అమలు చేసి.. మిగతా రెండు కాలనీలను వెలివేశారని మండిపడ్డారు. అందుకే, అధికార పార్టీకి చెందిన వారిని తాము బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఇది తమ కాలనీల అస్థిత్వం, ఆత్మ గౌరవానికి చెందిన అంశమని.. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.