టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ (YCP) గూటికి చేరారు. తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిశారు. క్యాంపు కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్.
రాయుడు వైసీపీలో చేరతారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల్లో మమేకం అవుతున్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరతారనే వార్తలకు బలం చేకూరింది. తాజాగా ఆయన వైసీపీలో చేరడంతో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
విద్యారంగంలో సీఎం జగన్ అనేక మార్పులు తీసుకు వచ్చారని అంబటి రాయుడు తెలిపారు. జగన్ పాలన నచ్చి తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు వెల్లడించారు. నాడు-నేడు, క్రీడలకు.. సీఎం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. పేద పిల్లలను పైకి తీసుకొచ్చే విషయంలో అత్యంత కృషి చేస్తున్నారని కొనియాడారు.
సీఎం జగన్ అనుసరిస్తున్న పాలనా విధానాలు నచ్చి తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు రాయుడు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.