– శివ బాలకృష్ణ కస్టడీతో వెలుగులోకి సంచలన నిజాలు
– బంధువుల పేర్లతో భారీగా ఆస్తులు
– రియల్ ఎస్టేట్ సంస్థలతో సత్సంబంధాలు
– కుటుంబసభ్యుల పేర్లతో పెట్టుబడులు, షేర్లు
– ఎన్నికల ముందు వందకు పైగా ఫైల్స్ క్లియర్
– ఆదిత్య, ఫినిక్స్ సంస్థల నుంచి భారీగా ముడుపులు
– మరిన్ని రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి కోట్లు దండుకున్నట్టు గుర్తింపు
– కాల్ డేటా ఆధారంగా కూపీ లాగుతున్న ఏసీబీ
– ఆదిత్య, ఫినిక్స్ ప్రతినిధులను విచారించిన అధికారులు
అక్రమాస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయిన హెచ్ఎండీఏ (HMDA) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Shiva Balakrishna) విచారణ ముగింపు దశకు చేరుకుంది. బుధవారంతో 8 రోజుల ఏసీబీ కస్టడీ ముగుస్తుంది. మరికొన్ని రోజులు విచారిస్తే.. ఇంకా కీలక విషయాలు రాబట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం ఏడోరోజు కస్టడీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివ బాలకృష్ణ సోదరుడు శివ సునీల్, మేనల్లుడు భరత్ పేరు మీద భారీగా ఆస్తులు గుర్తించారు అధికారులు. కుటుంబసభ్యులతో పాటు స్నేహితుల పేర్లపైనా భారీగా బినామీ ఆస్తులను కూడబెట్టినట్టు తెలుసుకున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలలో పెట్టుబడులు, క్లియర్ చేసిన ఫైల్స్ కు ప్రతిగా పొందిన లబ్ధి ఇలా పలు విషయాలపై కూపీ లాగగా.. ఆదిత్య, ఫినిక్స్ సంస్థలకు చెందిన లింక్స్ బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థల ప్రతినిధులను విచారించారు అధికారులు.
ఫినిక్స్ తో ఫిక్స్ చేసుకున్నది ఎంతో..?
హెచ్‌ఎండీఏ ఆఫీసులో తనిఖీల సందర్భంగా కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించింది. శివ బాలకృష్ణతో పాటు పనిచేసిన ఉద్యోగులను సైతం విచారించింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల అనుమతి కోసం శివ బాలకృష్ణ భారీగా డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు దాదాపు వంద ఫైల్స్ ను క్లియర్ చేసినట్లు గుర్తించింది. పుప్పాలగూడ, నార్సింగిలలో రూ.వెయ్యి కోట్లకు పైగా విలువైన రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు తెలుసుకుంది. ఈ నేపథ్యంలోనే ఫినిక్స్, ఆదిత్య సంస్థలకు చెందిన ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించింది. ఈ రెండు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి శివ బాలకృష్ణకు ముడుపులు అందినట్లుగా అనుమానిస్తోంది. ఇవేకాకుండా బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చిన ఈయన.. కోట్ల రూపాయలు దండుకున్నట్లుగా ఏసీబీ భావిస్తోంది. విచారణ నేపథ్యంలో ఆయా రియల్ ఎస్టేట్ సంస్థల మెడకు ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది.
కుటుంబసభ్యుల పేర్లతో పెట్టుబడులు, షేర్లు
తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా లెక్కకు మించి శివ బాలకృష్ణ అవినీతి చిట్టా బయటపడుతోంది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల పేర్లతో భారీగా బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని సైతం ఏసీబీ విచారించింది. రియల్ ఎస్టేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా పనులు చేసి పెట్టిన ఈయన.. కోట్లు దండుకుని బినామీల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలతోపాటు రంగారెడ్డి, యాదాద్రి-భువనగరి, సిద్దిపేట, జనగాం జిల్లాలతో పాటు చౌటుప్పల్ లో 120కి పైగా ఎకరాల భూములను శివ బాలకృష్ణ అక్రమంగా సంపాదించాడు. వాటిని తన స్నేహితులు, కుటుంబ సభ్యుల పేరిట కూడబెటినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ఇవే కాకుండా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చి శివ బాలకృష్ణ వాటాలు తీసుకున్నట్టు తేలింది. ప్రధానంగా ఆదిత్య, ఫినిక్స్ కంపెనీలతో శివ బాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని.. బినామీల పేరిట షేర్లు కూడా కొనుగోలు చేసినట్టు గుర్తించారు అధికారులు.
కస్టడీ పొడిగిస్తారా?
2021 నుంచి 2023 వరకూ హెచ్ఎండీఏలో శివ బాలకృష్ణ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతులపై ఏసీబీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కొత్త విషయాలన్నో వెలుగుచూస్తున్నాయి. బుధవారంతో 8 రోజుల విచారణ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు కస్టడీని పొడిగించాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ కంపెనీల పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.