జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren)కు షాక్ తగిలింది. రాంచీలోని పీఎంఎల్ఏ (PMLA) కోర్టు సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ కస్టడీకి అనుమతించింది. సోరెన్‌ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తున్నట్టు పీఎంఎల్ఏ కోర్టు వెల్లడించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన్ని ఈడీ ఆయన్ని బుధవారం రాత్రి అరెస్టు చేసింది.
అనంతరం సోరెన్‌ను రాంచీలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ అధికారులు హాజరు పరిచారు. పది రోజుల పాటు సోరెన్ ను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. కానీ కేవలం ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాంచీలో భూ అక్రమాలకు సంబంధించి సోరెన్ కీలక లబ్ధిదారుడని ఈడీ అభియోగాలు నమోదు చేసింది.
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ రికార్డులను సృష్టించడం ద్వారా ల్యాండ్ పార్సిళ్లకు సంబంధించిన నకిలీ డీడీలను సృష్టించేందుకు బ్రోకర్లు, వ్యాపారవేత్తల నెట్వర్క్ సంవత్సరాలుగా పనిచేస్తోందని పేర్కొంది. జేఎంఎం నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఖండించారు. దీనికి ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని తెలిపారు. సోరెన్ తన స్నేహితుడని వెల్లడించారు. ఆయనకు మద్దతుగా తాను నిలబడతానని చెప్పారు.
ఇది ఇలా వుంటే సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నూతన సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం చేశారు. రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో చంపై సోరెన్‌తో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. జేఎంఎం ఉపాధ్యక్షుడిగా ఆయన పని చేస్తున్నారు. చంపై సోరెన్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను జేఎంఎం హైదరాబాద్‌కు తరలించింది.