హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) కాంగ్రెస్ గూటికి చేరతారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సికింద్రబాద్ లేదా మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట తనకు టికెట్ కేటాయించాలని ఇప్పటికే బీఆర్ఎస్( BRS) కు ఆయన అల్టిమేటం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బొంతు రామ్మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డితో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఖాళీ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అటు జగ్గా రెడ్డి నేతలు కూడా దీనికి తగ్గట్టుగానే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సుమారు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి చేరుతారంటూ లీక్ లు ఇస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ కావడంతో బీఆర్ఎస్లో కలవరం మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఆయనకు నిరాశకు ఎదురైంది. రామ్మోహన్ ను కాదని ఉప్పల్ టికెట్ ను బండారు లక్ష్మా రెడ్డికి అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
త్వరలో జరగబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రబాద్ లేదా మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఆయన ఆశిస్తున్నారు. కానీ టికెట్ దక్కే అవకాశాలు సన్నగిల్లడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.