కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ (Congress) సర్కార్ ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. ఈ 72 రోజుల్లో ఉచిత బస్సు మినహా కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు. హరీశ్ రావు సమాధానాలకు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయారని చెప్పారు.
అందుకే అసెంబ్లీలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి పుడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్,కేసీఆర్ మీద బీజేపీ బురద జల్లిందని… మరి ఇప్పుడు హామీల విషయంలో కాంగ్రెస్‌ను ఆ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు.
మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ పాలనను పూర్తిగా బద్నాం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం లేదని.. ప్రత్యామ్నాయం లేదని అన్నారు.
గత ప్రభుత్వం ఏం చేసింది..? అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తామని ప్రభుత్వం చెప్పకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్‌లో సరిపడా కేటాయింపులు లేవని వెల్లడించారు. 72 రోజులలోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా తేల్చిచెప్పిందని స్పష్టం చేశారు.