బీజేపీ (BJP) కి రాజీనామా చేసిన వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswami) కాంగ్రెస్ (Congress) గూటికి చేరారు. హైదరాబాద్ (Hyderabad) లోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన.. హస్తం కండువా కప్పుకున్నారు. వివేక్ తో పాటు ఆయన కుమారుడు వంశీకృష్ణ కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు. అందరం కలిసికట్టుగా ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పారు వివేక్. తెలంగాణ సాధనలో తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశాు. కేసీఆర్ రాక్షస పాలనను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. తనకు టికెట్ ముఖ్యం కాదని బీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. సోనియా తెలంగాణ ఇచ్చారని.. రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.
ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వివేక్ వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరికతో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. రాష్ట్రం కోసం పార్లమెంట్ లో కొట్లాడిన ఎంపీల్లో వివేక్ ఒకరని గుర్తు చేశారు. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో.. వచ్చే ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని తెలిపారు.
పార్టీలో అందరితో చర్చించి.. ఆహ్వానం మేరకు వివేక్ చేరినట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబంతో.. వెంకటస్వామి కుటుంబానికి మూడు తరాల అనుబంధం ఉందని.. సొంత కుటుంబంలోకి ఆయన వచ్చారన్నారు.