తైవాన్ అతిపెద్ద కంపెనీ ఫాక్స్‌కాన్(Foxconn) భారత్‌లో తన పట్టును మరింత బలంగా స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. దేశంలోని అతిపెద్ద దాతృత్వ సంస్థ హెచ్‌సీఎల్(HCL)తో చేతులు కలిపింది. సెమీకండక్టర్ చిప్‌లపై ఫాక్స్‌కాన్‌తో కలిసి తన ఫ్యాక్టరీని స్థాపించడానికి రూ.1200 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది.
ఫాక్స్‌కాన్ భారతదేశంలో అతిపెద్ద ఐఫోన్ల తయారీదారు, మొత్తం ఉత్పత్తిలో 68 శాతం వాటాను కలిగి ఉంది. దీని తరువాత పెగాట్రాన్ 18 శాతం, విస్ట్రాన్ [టాటా] 14 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, తైవానీస్ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్‌కాన్ దేశంలో హెచ్‌సీఎల్ గ్రూప్ భాగస్వామ్యంతో చిప్ అసెంబ్లీ, టెస్టింగ్ ప్లాంటు నిర్మించడానికి బిడ్‌లను ఆహ్వానించింది.
ఈ మేరకు ఈ ప్రాజెక్ట్ కోసం ప్రారంభపెట్టుబడిగా రూ.1,200 కోట్లు వెచ్చించాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే కొనుగోలు చేసిన సొంత స్థలంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఫాక్స్‌కాన్ తెలిపింది. అదేవిధంగా ఈ బిడ్‌ను ఫాక్స్‌కాన్ హాన్ హై టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆహ్వానించిందని కంపెనీ ప్రకటించింది. అందులో 40 శాతం వాటా కోసం 37.2 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈనెల ప్రారంభంలోనే భారత్‌లో చిప్ ప్యాకేజింగ్, టెస్టింగ్ వెంచరు ప్రారంభించడానికి హెచ్‌సీఎల్ గ్రూప్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భారత్‌లో సెమీకండక్టర్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫాక్స్‌కాన్ మొదట వేదాంతతో చేతులు కలిపింది. చైనాలో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి కారణంగా ఇప్పుడు హెచ్‌సీఎల్‌తో కలిసి భారత్‌లో వ్యాపారం చేసేందుకు ఫాక్స్‌కాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.