పేదలకు మోడీ (Modi) సర్కార్ గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేండ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మరో ఐదేండ్ల పాటు ఈ పథకం కొనసాగుతుందని తెలిపింది. ఈ పథకం కింద 81 కోట్ల మంది అర్హులకు నెలకు ఒకరికి 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ అందించనున్నట్టు తెలిపింది. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఐదేండ్లలో రూ. 11.8లక్షల కోట్లు ఖర్చవుతుందని వెల్లడించింది.
కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్ను రాబడి పంపిణీ విషయంలో 16వ ఆర్థిక సంఘం విధివిధానాలకు కేబినెట్ ఆమోదం చెప్పిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2025 అక్టోబర్ 2025 వరకు 16 వ ఆర్థిక సంఘం తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. 2026 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఐదేండ్ల కాలానికి సిఫార్సులు చెల్లుబాటు అవుతాయన్నారు.
ఉత్తరాఖండ్ సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆ సమయంలో ప్రధాని మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ గురించి ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు తెలుసుకున్నారన్నారు. రోజుకు సుమారు రెండు నుంచి మూడు సార్లు సీఎం పుష్కర్ సింగ్ ధామీతో మోడీ మాట్లాడారన్నారు.
మరోవైపు మహిళలకు కూడా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా గ్రూపులకు వ్యవసాయ డ్రోన్‌లను అందించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఈ పథకం కింద 15వేల డ్వాక్రా గ్రూపులకు డ్రోన్లు అందించాలని, వాటిపై మహిళలకు శిక్షణ అందించాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయ అవసరాల కోసం ఈ డ్రోన్‌లను రైతులకు డ్వాక్రా గ్రూపులు అద్దెకు ఇవ్వనున్నాయి.
వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా స్వయం సహాయక బృందాలతో మోడీ నేరుగా మాట్లాడుతారని పీఎంఓ పేర్కొంది. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రోత్సహించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకొందన్నారు. దీంతో పాటు జన్ ఔషది కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచనున్నట్లు ప్రకటించింది.