2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ( vote-on-account contains)ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఈ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో రూ.2,01,178 కోట్లను రెవెన్యూ వ్యయంగా, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో పద్దులను ప్రభుత్వం ప్రతిపాదించింది.
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని వెల్లడించారు. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప… అమలుకు దిబ్బ అన్నట్టుగా ఉండేవని చెప్పారు.
గత పాలకుల నిర్వాకం వల్ల ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని మండిపడ్డారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో పూర్తిగా సంతులిత వృద్ధిని సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. వ్యవసాయానికి రూ.19,746 కోట్లను కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో పేర్కొంది.
ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు, మూసీ రివర్ ఫ్రాంట్‌కు వెయ్యి కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.13,013. రూ. మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు, విద్యా రంగానికి రూ.21,389 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించింది.
బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు, బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు, యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు, వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు, విద్యుత్ – గృహ జ్యోతికి రూ.2,418కోట్లు కేటాయింపులు చేసింది.