ప్రభుత్వ అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపాలనుకోవడం నక్సలైట్ (మావోయిజం) వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల, పౌరుల త్యాగాలను అవమానించడమేనని యాంటీ టెర్రరిజం ఫోరం (ATF) కన్వీనర్ డా. రావినూతల శశిధర్ (Ravinuthala Sasidhar) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాదిమంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించిన వ్యక్తి అని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన నక్సల్ ఉద్యమం వేలాదిమంది పోలీసులను బలి తీసుకుందని ఆయన అన్నారు.
తన సాహిత్యం ద్వారా యువతను దేశద్రోహులుగా తయారు చేసిన గద్దర్ వంటి ఒక వ్యక్తికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని అన్నారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో, శాంతి భద్రతలను కాపాడడంలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల, ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు
. ఈ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని, పోలీసు అమరవీరుల కుటుంబాలు ఈ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయని రావినూతల శశిధర్ పేర్కొన్నారు. దీన్ని ఒక వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడరాదని, నక్సలైట్ (మావోయిజం) భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందని.. పేర్కొన్న ఆయన.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.