రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యువత మత్తుకు బానిసలవుతున్నారు. స్కూల్ పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తుండడం కలకలం రేపింది. విద్యార్థులు మత్తులో తూగుతుండడంతో ఉపాధ్యాయులు కంగుతిన్నారు.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కొత్తూరు(Kothur)లో వెలుగులోకి వచ్చింది. పాఠశాల సమీపంలో విద్యార్థులకు కొద్ది రోజులుగా పాన్ డబ్బాల యజమానులు చాక్లెట్లు పంపిణీ చేస్తున్నారు. ఆ చాక్లెట్లు తిని తరగతి గదిలో మత్తులోకి జారడంతో పాటు విద్యార్థులు వింతగా ప్రవర్తించడం చేస్తున్నారు. విద్యార్థుల వింత ప్రవర్తన గమనించిన ఉపాధ్యాయులు.. విద్యార్థులను ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ విద్యార్థులకు చాక్లెట్లు విక్రయించిన పాన్ డబ్బాల యజమానులపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జి రవికుమార్ మాట్లాడుతూ.. ఇక్కడి పాఠశాలలో వివిధ కంపెనీల్లో పనిచేసే గ్రామీణ ప్రాంతానికి చెందిన వారి పిల్లలే ఎక్కువగా చదువుకుంటున్నారని తెలిపారు. అయితే ఉదయం పాఠశాలకు ఏమీ తినకుండా రావడం వల్ల నీరసంతో ఉంటారని తాము పాఠశాలలో బిస్కెట్లు, నీళ్లు ఇస్తున్నామని తెలిపారు.
అయితే, కొందరు పిల్లలు తరగతి గదుల్లో నిద్రిస్తుండడం తమ దృష్టికి వచ్చిందని రవికుమార్ తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులను పిలిపించి మాట్లాడగా చాక్లెట్లకు సంబంధించిన విషయం తెలిసిందన్నారు. ఔట్ సైడ్ ఫుడ్ తినొద్దని పిల్లలకు రోజు చెప్తూనే ఉన్నామని, కొందరు పిల్లలు మాత్రం వినిపించుకోనట్లు తెలుస్తోందన్నారు. ఈ స్థితిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో పూర్తి స్థాయిలో తెలియదని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
ఈ మేరకు ఎస్వోటీ పోలీసులు కొత్తూర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాన్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. మొదటగా విద్యార్థులు ఫ్రీగా ఈ చాక్లెట్లను పంచిపెట్టి వారికి గంజాయిని అలవాటుగా మార్చారు. ఆ తరువాత వారు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్ను రూ.20కి విక్రయించినట్లుగా తేలింది. నిందితుల నుంచి 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.