Telugu News » Telangana : 4 కాదు.. 20 కంప్యూటర్లు..!

Telangana : 4 కాదు.. 20 కంప్యూటర్లు..!

ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్లను ఇంతకాలం వాడిన వారు.. వాటిని తిరిగి అప్పగించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీచేయడంతో పాటు గత ప్రభుత్వంలో వాటిని ఏయే అవసరాలకు వినియోగించారనే వివరాలను సేకరించనున్నారు.

by admin
Computers Missing In Pragathi bhavan

– చర్చనీయాంశంగా ప్రగతి భవన్ కంప్యూటర్ల అంశం
– తరలింపుపై వెలుగులోకి సంచలన నిజాలు
– ముందు 4 కంప్యూటర్లు బయటకెళ్లినట్టు గుర్తింపు
– సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తర్వాత 20గా భావిస్తున్న అధికారులు
– నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమౌతున్న సర్కార్
– ఇంతకీ.. వాటిలో ఏ వివరాలు ఉన్నాయి?
– ఎవరి ఆదేశాలతో తరలించారు?
– ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయి?
– ప్రభుత్వ అవసరాలకు వాడినవి ఎందుకు మాయం అయ్యాయి?

ఎన్నికల తర్వాత ప్రగతి భవన్ కాస్తా.. ప్రజా భవన్ గా మారింది. బయట ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయి. ప్రజలకు ఎంట్రీ వచ్చింది. అయితే.. అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన డిసెంబర్ మూడో తేదీన రాత్రి ప్రగతి భవన్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఆరోజు రాత్రి 4 కంప్యూటర్లు మాయమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రాత్రే అవి బయటకు వెళ్లినట్లు తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.

Computers Missing In Pragathi bhavan

ఈ అంశంపై ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులు రంగంలోకి దిగగా.. సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించాక మొత్తం 4 కాదు 20 కంప్యూటర్లు పోయినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో అప్పట్లో వివిధ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను చూసిన అధికారుల ఆదేశాలతో.. కిందిస్థాయి సిబ్బంది వీటిని తరలించినట్లు చెప్పుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాల ఆధారంగా ఆ కంప్యూటర్లను తీసుకెళ్తున్న సిబ్బందికి నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్లను ఇంతకాలం వాడిన వారు.. వాటిని తిరిగి అప్పగించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీచేయడంతో పాటు గత ప్రభుత్వంలో వాటిని ఏయే అవసరాలకు వినియోగించారనే వివరాలను సేకరించనున్నారు. అసలు, వాటిలో ఎలాంటి సమాచారం ఉంది? ఎవరి ఆదేశాలతో తరలించారు? ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వ అవసరాలకు వాడిన వాటిని మాయం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి విషయాలన్నింటిపై కూపీ లాగుతున్నారు.

అయితే.. ఇక్కడ ఓ ప్రశ్న ప్రజల వైపు నుంచి బలంగా వినిపిస్తోంది. సిబ్బందికి మాత్రమే సర్కార్ నోటీసులు ఇస్తుందా? లేక వాటిని పర్యవేక్షించే అధికారులపైనా, వారి వెనుక ఉన్నవారిపైనా చర్యలుంటాయా? అని అడుగుతున్నారు. ఇప్పటికే ఆఫీసుల్లోని ఫైళ్ళు మాయం అవుతున్నాయి. ఇప్పుడు కంప్యూటర్లలోని డేటా కూడా చౌర్యానికి గురికావడం వివాదాస్పదంగా మారింది.

వాస్తవానికి శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీఎస్ శాంతి కుమారి సెక్రటేరియట్ కదలికలపై నిఘా పెట్టారు. అనుమతి లేకుండా ఎవరూ చిన్న కాగితం కూడా బయటికి తీసుకెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెక్యూరిటీ స్టాఫ్ అందరినీ చెక్ చేసి పంపారు. కానీ, ప్రగతి భవన్ కదలికలపై మాత్రం దృష్టి పెట్టలేదని కంప్యూటర్ల వ్యవహారంతో తేలిపోయిందని అంతా అనుకుంటున్నారు.

You may also like

Leave a Comment