భారతీయ జనతా పార్టీ (Bjp) బీజేపీ నుంచి నటి గౌతమి(Actress Gauthami) వైదొలగడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ(Khushboo) చేసిన వ్యాఖ్యలను మరో నటి, కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురాం(Gayatri Raghuram) తీవ్రంగా తప్పుబట్టారు.
బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు నటి గౌతమి ప్రకటించడంపై ఖుష్బూ స్పందిస్తూ.. గౌతమి పార్టీని వీడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమి భవిష్యత్తు కార్యాచరణ పథకాలన్నీ పార్టీ అభివృద్ధికి దోహదపడేలా వున్నాయని, కానీ ఆమె ఎందుకు వెళ్లిపోయిందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై గాయత్రి సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.
బీజేపీ(BJP)లో మహిళలకు గౌరవం లేదని, ఆ పార్టీలో గూండాలు, మోసగాళ్లకే తగిన గుర్తింపు వుంటుందని వ్యాఖ్యానించారు. తనకు గౌరవం లేకపోవడం వల్లనే గౌతమి బీజేపీ వీడారని తెలిపారు. ఆమె ఎందుకు పార్టీని వీడాల్సివచ్చిందో ఖుష్బూ అధిష్టానాన్ని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.
అయితే ఖుష్భూ, గాయత్రి రఘురామ్ మధ్య మాటల యుద్ధం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఖుష్బూ ఓ బ్రోకర్ అంటూ గాయత్రి రఘురాం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం లేపాయి. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఖుష్భూ అవహేళన చేసినందుకు గాయత్రి రఘురాం ఆ విధంగా స్పందించారు. ఖుష్బూపై నెటిజన్లు సైతం విమర్శలు గుప్పించారు.