గాజా(Gaza)లో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధం భీకరంగా సాగుతుండటం వల్ల అక్కడ తీవ్రమైన ఆహార కొరత(Food Crisis) నెలకొంది. మానవతా సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహారం కోసం జనం ఎగబడడంతో కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. మానవతా సాయం అందించే ట్రక్కులు కదిలే పరిస్థితి లేదంటే ప్రజలు ఎంతటి క్షోభను అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, కరెంటు కొరతతో దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. మందుల దుకాణాల్లో అత్యవసర మందులన్నీ నిండుకున్నాయి. కరెంటు, తిండి పక్కనబెడితే ఇప్పుడు గుక్కెడు మంచి నీళ్లను సాధించడమే అక్కడి ప్రజల జీవన్మరణ సమస్యగా మారింది. గాజాలో మానవతా సాయం అందించే ట్రక్కులు రాగానే జనం ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ తుపాకీలు గురిపెట్టి ఆహారాన్ని అందించాల్సి వస్తోంది.
ఇజ్రాయెల్ దాడులు ఎడతెరిపి లేకుండా సాగుతుండటంతో మానవతాసాయాన్ని అంతరాయాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖైదీల విడుదల కోసం తాము చేసిన డిమాండ్లు నెరవేరకపోతే ఇజ్రాయెల్‌కు చెందిన బందీలు సజీవంగా గాజా నుంచి బయటపడలేరని హమాస్ హెచ్చరించడం వల్ల ఐడీఎఫ్ బలగాలు దాడుల తీవ్రతను పెంచాయి.
బందీలను విడిపించుకునేందుకు తాము చేయగలినదంతా చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ వద్ద ఇంకా 138మంది బందీలు ఉన్నట్లు యూదు దేశం చెబుతోంది. బందీలు పూర్తిగా విడుదల కాకపోవడం వల్ల నెతన్యాహు సర్కార్ ఇజ్రాయెలీల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మరోవైపు కాల్పుల విరమణ కోసం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మంగళవారం గాజాలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.