కాంగ్రెస్‌పై డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)చీఫ్ గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యాన్ని బీజేపీ సాధిస్తే, విపక్షమైన భారత్‌కు నాయకత్వం వహించడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
జమ్ములో ప్రగ్వాల్‌లో మీడియాతో గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ….. మాజీ ప్రధానులు పీవీ నరసింహ రావు, చౌదరి చరణ్ సింగ్‌లకు భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం విశిష్ట సేవలందించినందుకు వారు ఈ గౌరవాలకు అర్హులని తెలిపారు. బీజేపీకి 400 మార్క్ దాటుతుందా లేదా అనే విషయాన్ని చెప్పేందుకు తానేమీ జ్యోతిష్యున్ని కాదన్నారు.
బీజేపీకి 400 సీట్లు దాటితే అందరినీ వెంట తీసుకెళ్లడంలో విఫలమైన వారిదే బాధ్యత అని పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి బలంపై నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై స్పందిస్తూ….ఒమర్ అబ్దుల్లా అటల్ బిహారీ వాజ్ పాయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు.
బహుశా ఒమర్ అబ్దుల్లా తన పాత విధేయతను గుర్తుంచుకొని ఉండవచ్చని ఎద్దేవా చేశారు. బీజేపీ ఏం తప్పు చేసినా తాను మొదట విమర్శించే వ్యక్తిని తానేనని ఆజాద్ అన్నారు. అదే విధంగా ఒక వేళ కాంగ్రెస్ ఏదైనా మంచి చేస్తే వాళ్లకు క్రెడిట్ ఇచ్చే తొలి వ్యక్తిని తానేనని చెప్పారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, చౌదరీ చరణ్ సింగ్ లకు భారతరత్న ఇస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.