తెలంగాణ(Telangana)లో అధికారాన్ని చేజిక్కించుకున్నకాంగ్రెస్ పార్టీ(Congress Party) ఇప్పుడు ఏపీలో పాగా వేసే దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్(APCC Chief ) గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraju)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ(Vijayawada)లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను స్థానాలను మారిస్తే, ఒకచోట చెల్లనిది మరోచోట ఎలా చెల్లుబాటవుతుందని ప్రశ్నించారు.
బలహీనవర్గాల నాయకులను తక్కువ చేయడానికే ఈ మార్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇక, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని ఆరోపించారు. టీడీపీ ఇద్దరితోనే నడుస్తోందని, ఇక వైసీపీ కార్యవర్గ సమావేశం ఎప్పుడు జరిగిందో తెలీదంటూ సెటైర్లు విసిరారు. పార్టీ నాయకుల మనోభావాలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ తెలుసుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో యువభేరి నిర్వహించనున్నట్లు రుద్రరాజు అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మండలాధ్యక్షులను నియమించుకున్నామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో యువత మత్తు పదార్థాలకు బానిస అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల మద్యం రాష్ట్రంలో అమ్ముడవుతోందని ఆరోపించారు.