!Goa : గోవాలోని నైట్ క్లబ్ లో ఓ మహిళా టూరిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై ఓ ఐపీఎస్ అధికారిని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం అసెంబ్లీ వరకు వెళ్ళింది. గురువారం శాసన సభలో ఈ అధికారి నిర్వాకాన్నిగోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ అనే ఎమ్మెల్యే ప్రస్తావించగానే సీఎం ప్రమోద్ సావంత్ కల్పించుకుని అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2009 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ఏ. కోన్ అనే ఈయనను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు హోమ్ మంత్రిత్వ శాఖ పేర్కొందని ఆయన చెప్పారు.
.కాగా మద్యం మత్తులో ఉన్న కోన్.. గత సోమవారం రాత్రి ఓ నైట్ క్లబ్ లో మహిళా టూరిస్టును లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. కోన్ వ్యవహారానికి సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర హోమ్ శాఖకు పంపింది. ఈ నివేదికలోని అంశాలు నిజమని తేలడంతో కోన్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడమే గాక, ఆయనపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటించింది.
ఆయనను గోవా పోలీసు హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో గోవా పోలీసు శాఖ కూడా అంతర్గత విచారణ ప్రారంభించింది. కాగా కోన్ అసభ్య ప్రవర్తనతో ఆగ్రహించిన బాధిత మహిళా టూరిస్టు .. ఆమె స్నేహితులు అతనిపై దాడికి దిగినట్టు తెలిసింది.