కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ బీజేపీకి దేవుడు ఇచ్చిన వరం లాంటి వారని అన్నారు. ప్రతిపక్ష నేత ఇలా ఉంటే మనం ఖచ్చితంగా అదృష్టవంతులుగా భావించాలని తెలిపారు. రాహుల్ లాంటి ప్రతిపక్ష నేతలు ఉండటం బీజేపీకి కలిసి వస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎల్లప్పుడూ తన గురించి మాత్రమే తాను ఆలోచించుకుంటుందని వెల్లడించారు. అందుకే కాంగ్రెస్ కు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పార్టీలు, సంస్థల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోయందన్నారు. ఆ పార్టీలో కేవలం నాయకులు బాగుపడ్డారే కానీ కార్యకర్తలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. బీజేపీలో అత్యంత విధేయులు ఎవరైనా ఉంటే అది కార్యకర్తలేనన్నారు.
సామాన్య కార్యకర్తల కన్నా పెద్ద వాళ్లు పార్టీలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇలాంటి విధానం కేవలం బీజేపీలోనే సాధ్యమవుతుందన్నారు. పార్టీ అగ్రనేత అమిత్ షా కూడా ఇదే విషయం చెప్పారన్నారు. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. మహావిజయ్ 2024 ప్రాముఖ్యతను ఈ సందర్బంగా కార్యకర్తలకు వివరించారు.
కొత్త తరానికి అవకాశాలు ఇచ్చేలా పార్టీలో మార్పులు చేర్పులు జరిగాయన్నారు. ప్రస్తుతానికి కొంత మందిని పక్కకు పెట్టామన్నారు. వారి రాబోయే రోజుల్లో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మరోసారి బీజేపీ సర్కార్ ను అధికారంలోకి తీసుకు వచ్చేలా కార్యకర్తలంతా కలిసి కట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.