తెలంగాణ (Telangana)లో రాజకీయ నేతల మాటలు వార్నింగ్ ఇచ్చుకునే వరకు వెళుతున్నాయి. ఇక విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఒకరినొకరు తీవ్ర పదజాలంతో విమర్శించుకోవడం కనిపిస్తూనే ఉంది. మరి రాజకీయాల్లో అందరూ దొంగలే అయితే నీతివంతులు లేనట్టేనా? అనే అనుమానం ఈ సందర్భంగా సామాన్య ప్రజలకు వస్తోంది.
అయితే ఇప్పటికే పలువురు నేతలు తెలంగాణ సీఎం (CM) కేసీఆర్ (KCR) పై విమర్శల పర్వానికి తెరలేపారు. కాగా ఇప్పుడు కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత రేణుకా చౌదరి (Renuka Chaudhary) కూడా విరుచుకు పడ్డారు. తెలంగాణ బిడ్డ ప్రవల్లిక ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని.. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలంటూ కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ పార్టీ పేరు మార్చి తన జాతకం, గోత్రం మార్చుకున్నారని ధ్వజమెత్తారు. మాటలకి జీఎస్టీ (GST) లేదు.. చేతల్లో దమ్ము లేదు.. అందుకే కేసీఆర్ నోటికి పనిచెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు.
తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్నా తానే ఉచితంగా చదిస్తున్నట్టు కేసీఆర్ సొల్లు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐటీ కింగ్ అంటున్న కేటీఆర్.. పేపర్ల లీకేజీకి బాధ్యత వహించకుండా విద్యార్ధులను మభ్య పెడుతున్నాడని, బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు తండ్రి, కొడుకు కలిసి ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.