గూగుల్ మ్యాప్స్‌ను( Google Maps ) నమ్ముకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లిన ఘటనలు తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే, తాజాగా గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న ఓ ట్రావెల్ గ్రూప్‌నకు షాకింగ్ అనుభవం ఎదురైంది. కొందరు ట్రావెలర్స్(Travelers Group) నెవాడా ఎడారిలో చిక్కుకుపోయారు.
కాలిఫోర్నియాకు (California) చెందిన ఒక ట్రావెల్ గ్రూప్ 2023, నవంబర్ 19న ఫార్ములా 1 రేస్‌కు హాజరైంది. తర్వాత ఈ ట్రావెలర్స్ లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో 50నిమిషాల ప్రయాణాన్ని ఆదా చేసుకునేందుకు గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు. అయితే, షార్ట్ కట్ మార్గం ఓ ఎడారి అని వారు గుర్తించలేకపోయారు.
ఈ బృందంలో షెల్బీ ఈస్లర్, ఆమె సోదరుడు ఆస్టిన్, వారి స్నేహితులు ఉన్నారు. వారు ఇంతకు ముందు లాస్ వెగాస్, లాస్ ఏంజిల్స్ మధ్య ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. దీంతో వారు వెళ్లే దారి సరైనదా? కదా? అని గమనించలేకపోయారు. ఇంటర్‌స్టేట్ 15 హైవే ట్రాఫిక్ కారణంగా గూగుల్ మ్యాప్స్‌ను షార్ట్‌కట్ రూట్ అని ఎడారి దారి చూపించింది. దీంతో ఆవైపు వెళ్లగా పూర్తిగా ఎడారి మార్గం కావడంతో కంగుతిన్నారు.
అదే దారిలో ఇసుక, బురదలో కూరుకుపోయిన ఇతర కార్లు వారికి కనిపించాయి. పెద్ద ట్రక్కు ఉన్న డ్రైవర్లలో ఒకరు, తుఫాను వల్ల రహదారి కొట్టుకుపోయిందని, బయటకు వెళ్లే మార్గం లేదని వారికి చెప్పాడు. తిరిగి హైవేపైకి వెళ్లాలని సూచించాడు. దీంతో ఆ ట్రావెలర్స్ సాయం కోసం కాల్ చేయడానికి ప్రయత్నించి టో ట్రక్ సర్వీస్‌ను సంప్రదించారు. అది వారిని చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఎడారి నుంచి బయటపడ్డారు.