24 గంటల కరెంట్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ సిద్దిపేట (Siddpet) జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఉచిత విద్యుత్ (Free Electricity) అని చెబుతూ కనీసం రోజుకు పది గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదంటూ మిరుదొడ్డి మండలంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
పది గంటలు కోత విధించడంతో పంటలు ఎండిపోతున్నాయంటూ ఆళ్వాల్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దెల రాజేశం మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…..
బంగారు తెలంగాణలో బీఆర్ఎస్ అంటేనే లిక్కర్, మద్యం, అబద్దపు హామీలంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాస్తారోకో నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
మండల విద్యుత్ శాఖ అధికారులతో కలిసి రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికోడ్ అమలులో వుందని, ఎలాంటి ధర్నాలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు అన్నారు. విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు అన్నారు. వెంటనే ఆందోళనను విరమించాలని కోరారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.