గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, అలాంటి వార్తలకు గవర్నర్ చెక్ పెట్టారు. డిసెంబర్ 30వ తేదీ శనివారం అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన బోయిన్ పల్లి(BoinpallI) లోని అనురాధ టింబర్ డిపోను గవర్నర్ తమిళిసై సందర్శించారు.
అయోధ్య రామ మందిర ద్వారాలకు తలుపులను ఇక్కడి నుంచి తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాముడి ప్రతిమ చూసి చాలా సంతోషం కలిగిందని, కష్టమైన పనిని చక్కగా తీర్చి దిద్దడం బాగుందంటూ కితాబిచ్చారు. శనివారం అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగమైన బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోను గవర్నర్ సందర్శించారు.
రామ మందిరంలో అనురాధ టింబర్స్ కూడా ఒక గొప్ప భూమిక పోషించడం ఎంతో గర్వకారణమని గవర్నర్ అన్నారు. తాను ఒక గవర్నర్ గా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, అవసరమైతే వాళ్ళనే తన దగ్గరకు పిలిపించుకోవచ్చని, అయితే అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూద్దామనే ఇక్కడకు వచ్చానని తెలిపారు.
అయితే తన రాజీనామాపై వార్తలను గవర్నర్ తమిళిసై కొట్టిపారేశారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎంపీగా పోటీ చేస్తానని తాను ఇంతవరకు అధిష్టానానికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని స్పష్టం చేశారు. తనకు అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానన్నారు. తుత్తుకుడిలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లానే తప్ప.. రాజీనామా చేసి తుతుకుడి నుంచి పోటీ చేస్తానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను తెలంగాణలోనే ఉంటానని, ప్రజలకు సేవ చేయడమేంటే తాను ఇష్టపడతానని తెలిపారు.