టీఎస్పీఎస్సీ (TSPSC) చైర్మన్, సభ్యుల రాజీనామాలకు ఎట్టకేలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బుధవారం వారి రాజీనామాలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ (BRS) పాలనలో టీఎస్పీఎస్సీపై అనేక ఆరోపణలు వచ్చాయి. నోటిఫికేషన్లలో జాప్యం.. పేపర్ల లీకేజీ.. అక్రమాలు అంటూ ఎన్నో ఘటనలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఎన్ని ఆరోపరణలు వచ్చినా బోర్డును మాత్రం టచ్ చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. చైర్మన్ సహా సభ్యులపై చర్యలు అనేవే లేవు. అయితే.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో టీఎస్పీఎస్సీ సభ్యులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మిగతా ఐదుగురు సభ్యులు తమ పదువులకు రాజీనామా చేశారు.
తమ రాజీనామా లేఖలను అప్పట్లోనే అందరూ గవర్నర్ కు పంపించారు. అయితే.. టీఎస్పీఎస్సీపై ఉన్న ఆరోపణలు, లీకేజ్ కేసుల నేపథ్యంలో రాజీనామాలు ఇన్నాళ్లూ గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై న్యాయపరమైన సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత తాజాగా ఆమోదించారు తమిళిసై. దీంతో టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయినట్టయింది.
టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే, దీనిపై గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే గవర్నర్ రాజీనామాలపై నిర్ణయం తీసుకున్నారు.