– ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
– ఎట్టకేలకు ఆమోదం
– కార్మికులకు కంగ్రాట్స్ చెప్పిన తమిళిసై
ఆర్టీసీ (RTC) ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడానికి సంబంధించిన బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఎట్టకేలకు బిల్లుకు గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు. న్యాయశాఖ పరిశీలన తర్వాత బిల్లులోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన నేపథ్యంలో నెల రోజుల తర్వాత ఉత్కంఠ వీడింది. గవర్నర్ ఓకే చెప్పడంతో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని ఇటీవల మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశ పెట్టి.. గవర్నర్ అనుమతి కోసం పంపంది. కానీ, తమిళిసై కొన్ని డౌట్స్ లేవనెత్తారు. వివరణ కోరుతూ రాజ్ భవన్ (Raj Bhavan) ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే సమయంలో బిల్లు ఆమోదించాలని ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. కార్మిక సంఘాల నేతలను చర్చలకు పిలిచిన గవర్నర్.. తన ఉద్దేశాన్ని వారికి వివరిచారు. తనకు ఉద్యోగులతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
కార్మికులకు న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని తమిళిసై చెప్పగా.. ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కానీ, దీనికి సంతృప్తి చెందని గవర్నర్.. న్యాయ శాఖ పరిశీలనకు పంపారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు ఆమెను టార్గెట్ చేశారు. కావాలనే బిల్లును ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ కూడా అదేస్థాయిలో రియాక్ట్ అవుతూ వచ్చారు. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్ర విభజన, ఆర్టీసీ స్థితిగతులపై వివరంగా లేదని అన్నారు.
అయితే.. ఇటీవల ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలు, విలీన ప్రక్రియకు సంబంధించి పలు సూచనలను గవర్నర్ కు చేసినట్లు వారు తెలిపారు. బిల్లుపై తగిన సూచనలు తీసుకుని రెండు రోజుల్లో ఆమోదం తెలుపనున్నట్లు తమిళిసై చెప్పారని ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు. వాళ్లు చెప్పినట్టుగానే తమిళిసై రెండు రోజుల్లో బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.