పూర్వ విద్యార్థుల కలయిక కేవలం తమ సంతోషం కోసమే కాకుండా తమను విద్యావంతులుగా తీర్చిదిద్దిన సంస్థకు వీలైనంత చేయూత ఇచ్చే విధంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ ( Governor )తమిళి సై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) అన్నారు. కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తమిళి సై ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
యూనివర్సిటీలో పలు అభివృద్ది పనులను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…. కళాశాలల్లో విద్య పూర్తి చేసి పలు రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, తాము చదివిన కళాశాలకు వీలైనంత సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ పూర్వ విద్యార్థులంతా కలిసి యూనివర్సిటీలో అభివృద్ది పనులకు తోడ్పాటు అందిచడం అభినందనీయమన్నారు.
ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించటం ప్రశంసనీయమని కొనియాడారు. అంతకు ముందు మెకానికల్ ఇంజనీరింగ్ సెమినార్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్టేజీ పైకి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గవర్నర్ కింద పడిపోయారు.
పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ఆమెను పట్టుకొని పైకి లేపారు. గవర్నర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.