– రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్
– తెరపైకి మరో వివాదం
– గవర్నర్ కోటా ఎమ్మెల్సీ..
– అభ్యర్థిత్వాల తిరస్కరణ
– రాజ్ భవన్ నుంచి సీఎస్ కు లేఖ
ప్రగతి భవన్ (Pragati Bhavan), రాజ్ భవన్ (Raj Bhavan) మధ్య ఏదో ఒక వివాదం రావడం.. తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ గా జరుగుతోంది. ఈమధ్యే ఆర్టీసీ బిల్లు విషయంలో పెద్ద రచ్చ జరిగి.. చివరకు పలు సవరణలతో ఆమోద ముద్ర వేశారు గవర్నర్ తమిళిసై (Tamilisai). తాజాగా మరో వివాదం రాజుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సులను తిరస్కరించారు గవర్నర్. ఈ మేరకు సీఎస్ (CS) కు రాజ్ భవన్ నుంచి లేఖ వెళ్లింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్ (Dasoju Sravan), కుర్రా సత్యనారాయణ (Kurra Satyanarayana) లను కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిని ఆమోదించాలని తమిళిసైకి సిఫార్సు చేసింది. అయితే.. ఈ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు తమిళిసై. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను లేవనెత్తారు. అభ్యర్థులిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు.. సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదంటూ లేఖ ద్వారా తెలియజేశారు.
రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని గుర్తు చేశారు గవర్నర్. ఈ ఇద్దరిని ఎంపిక చేయడానికి కావాల్సిన సమాచారం తన వద్దకు రాలేదని తెలిపారు. కుర్రా సత్యనారాయణ రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారని.. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో చాలా మంది వివిధ రంగాల్లో ప్రముఖలు ఉన్నా.. వారిని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
దాసోజు శ్రవణ్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు తమిళిసై. ఏ రంగంలోనూ ఆయన అచివ్ మెంట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించలేదని పేర్కొన్నారు. అర్హత ఉన్న వ్యక్తులను కేబినెట్ సిఫార్సు చేస్తే నియమిస్తానని తెలిపారు. ఇటీవల సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభం సందర్భంగా గవర్నర్, సీఎం నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో సయోధ్య కుదిరినట్టేనా అనే చర్చ జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం పంపిన అభ్యర్థిత్వాలను తిరస్కరించడంతో వార్ ఆగేలా లేదనే టాక్ నడుస్తోంది.