పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కోసం ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) అన్నారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ(Assembly)కి చేరుకున్న గవర్నర్కు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఘనస్వాగతం పలికారు. కొత్త ప్రభుత్వానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు తమిళిసై.
అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్న ఆమె ప్రజాపాలన మొదలైందని తెలిపారు. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి కోరుకున్నారని, నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందని వెల్లడించారు.
నియంతృత్వ పాలనా పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని తెలిపారు. ఇకపై నిర్బంధాన్ని సహించబోమని గవర్నర్ స్పష్టం చేశారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని తమిళిసై వ్యాఖ్యానించారు. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలైపోయాయని, ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పుకొచ్చారు.
అణిచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని గవర్నర్ అన్నారు. మార్పునకు తెలంగాణ ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మీ ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని.. ప్రజాసేవలో విజయం సాధించాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలుగులో కాళోజీ నారాయణ రావు పలుకులతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై దాశరథి గేయంతో ముగించారు.