చైనా (China)లో హెచ్9ఎన్2 వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. చాలా మంది చిన్నారులు నుమోనియా (Pneumonia) లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO)కూడా వెల్లడించింది. తాజాగా ఈ పరిస్థితిపై భారత ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది.
చైనాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏవియన్ ఇన్ ఫ్లూ యెంజా, శ్వాసకోశ వ్యాధుల వల్ల భారత్‌కు పెద్దగా రిస్క్ లేదని వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల నుంచి ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
ఇటీవల డ్రాగన్ కంట్రీలో నుమోనియా లక్షణాలతో చాలా మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరారు. ఈ క్రమంలో దీనిపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. నుమోనియా కేసులకు కొత్త తరహా ప్యాథోజన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని చైనా వివరణ ఇచ్చిందని పేర్కొంది. గత నెల నుంచి చైనాలో పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నమోదు అవుతున్నట్లు డేటా ప్రకారం తెలుస్తోందని వెల్లడించింది.
ఈ క్రమంలో వ్యాధులకు సంబంధించిన మరింత డేటాను అందించాలని చైనాను కోరామని తెలిపింది. బీజింగ్‌లో కానీ, లియానింగ్‌లో కానీ ఎలాంటి కొత్త ప్యాథోజెన్స్‌ను గుర్తించ లేదని చైనా చెప్పినట్టు పేర్కొంది. ‘ఇది కొత్త వ్యాధి లేదా కొత్త వైరస్ వ్యాప్తి కాదని, మైకోప్లాస్మా, న్యుమోనియా వంటి తెలిసిన వ్యాధికారక వ్యాప్తి అని చైనా చెప్పంది’అని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.