దేశంలో పర్యటక రంగానికి ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం (Union Governament) పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా దేశంలో పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా భారత్ (India)-శ్రీలంక (Srilanka) మధ్య రామ సేతు తరహాలో వంతెన నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు వంతెన నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనుంది.
ఈ వంతెనను తమిళనాడులోని ధనుష్ కోడి నుంచి శ్రీలంక తలైమన్నార్ వరకు 23 కిలోమీటర్ల మేర ఈ వంతెనను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. నూతనంగా నిర్మించనున్న ఈ రామసేతు వంతెన, శ్రీలంక పాక్ జలసంధి ద్వారా భారత్ లోని ధనుష్కోడిని కలిపే సేతుసముద్రం ప్రాజెక్ట్ శ్రీలంకను భారత్ తో కలపనుంది. దీంతో పాటు రవాణా ఛార్జీలు 50 శాతం తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్త (NHAI)అమలు చేయనుంది. ఆరు నెలల క్రితం కుదిరిన ఆర్థిక, సాంకేతిక ఒప్పందం వల్ల రూ.40,000 కోట్ల అభివృద్ధి జరుగుతుందని, ఇందులో కొత్త రైల్వే లైన్లు, రామసేతు వంతెన వంటి ప్రాజెక్టులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరిశోధనలను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
2022 జులైలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ట్రింకోమలి, కొలంబో ఓడరేవుల అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించే విషయంపై భారత్, శ్రీలంక అంగీకరించాయి. ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దీనిపై చర్చించింది. ఈ సమయంలోనే వంతెన సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి సంబంధించి నివేదిక తయారు చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.
ఇది ఇలావుంటే ప్రధాని మోడీ ఇటీవల తమిళనాడులో పర్యటించారు. ఆ సమయంలో ధనుష్కోడిని సందర్శించారు. దాంతో పాటు సమీపంలోని అరిచల్ మునైని సైతం సందర్శించారు. అరిచల్ మునై ప్రాంతం నుంచే ఈ రామ సేతు వంతెన నిర్మాణం ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.