గురు గోవింద్ సింగ్ (Guru Govind Singh).. సిక్కుల పదవ గురువు. సిక్కులను సింహాల్లాగా తీర్చిదిద్దిన ఘనత ఈయనకే దక్కుతుంది. వారిని గొప్ప సైనికులుగా మార్చి మొఘలు(Mughals)లపై ఎదురు తిరిగిన యోధుడు ఈయన. పటిష్టమైన ఖల్సా వ్యవస్థను ఏర్పాటు చేసి సిక్కులను అత్యంత బలవంతులుగా తీర్చిదిద్దారు.
1666 డిసెంబర్ 22న బిహార్ రాజధాని పాట్నాలో గురు గోవింద్ సింగ్ జన్మించారు. సిక్కుల తొమ్మిదవ గురు తేజ్ బహదూర్ కుమారుడే ఈయన. తల్లి మాతా గుజ్రీ. ఇస్లాం మతంలోకి మారాలన్న ఔరంగజేబు ఆజ్ఞను ధిక్కరించి మొఘల్ రాజుకు గురు తేజ్ బహదూర్ ఎదురు తిరిగారు.
దీంతో ఆయన్ను ఔరంగజేబు తన సైన్యంతో చంపించాడు. ఈ క్రమంలో తొమ్మిదేండ్ల వయసులోనే సిక్కుల పదవ గురువు స్థానాన్ని పొందారు. మొఘల్ రాజుల అకృత్యాలకు, దురాగతాలకు వ్యతిరేకంగా సిక్కుల్లో పోరాట స్ఫూర్తి రగిలించాలని అనుకున్నారు. వెంటనే, వారిని గొప్ప సైనికులుగా మార్చాలని అనుకున్నారు. దీని కోసం ఖల్సా వ్యవస్థను ఏర్పాటు చేశారు గురు గోవింద్ సింగ్.
సిక్కులు కచ్చితంగా 5 నియమాలను పాటించాలని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. కేశాలు, కంగా-ఎల్లప్పుడు జుట్టులో దువ్వెన పెట్టుకోవాలి. కభాలు-పొట్టి లాగులు, బలం కోసం కర- చేతికి ఇనుప కడియం, ఆత్మ రక్షణ కోసం కృపాణం-కత్తి ని ధరించాలని సూచించారు.