రాజకీయాల్లో ఓడలు బండ్లు కావచ్చు.. బండ్లు ఓడలు కావచ్చని సామెత ఉంది. ఇప్పుడు వైఎస్ షర్మిల (YS Sharmila) గ్రాండ్ గా ప్రారంభించిన వైఎస్సార్టీపీ (YSRTP) ఎడారిలో ఒంటరి నావలా మిగిలిందని అనుకుంటున్నారు. రాజన్న రాజ్యం తెస్తానంటూ గతంలో పార్టీ పెట్టిన షర్మిళ.. తీరా ఎన్నికల సమయంలో పోటీ చేయను, కాంగ్రెస్ కు మద్దతిస్తానని ప్రకటించడంతో వైఎస్సార్టీపీలో నిప్పు రాజుకుంది.
కాసేపు రాజన్న రాజ్యం అంటూ రాగం అందుకున్న షర్మిల, కాసేపు అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ అంటూ సొంతపార్టీ నేతలను ఉరుకులు పరుగులు పెట్టించింది. అంతలోనే కాంగ్రెస్ తో పొత్తు అనే పాట ఎత్తుకుంది. చివరిగా ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించడంతో వైఎస్ షర్మిలపై సొంతపార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గట్టు రామచంద్రరావు నేతృత్వంలో సోమాజిగూడ (Somajiguda) ప్రెస్‌క్లబ్ (Press Club)లో వైఎస్సార్టీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించారు. అనంతరం షర్మిల గో బ్యాక్ ఆంధ్ర అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణ (telangana) విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. తామంతా షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. మరోవైపు బయ్యారం గుట్టను దోచుకోవడానికి వచ్చిన షర్మిల ఖబర్దార్ అంటూ నాయకులు హెచ్చరించారు. తెలంగాణలో షర్మిల ఎక్కడా పోటీ చేసిన రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతామని హెచ్చరించారు.