నూతన సంవత్సరానికి గుజరాత్ ప్రభుత్వం గిన్నీస్ రికార్డు (Guinness Book)తో స్వాగతం పలికింది. రాష్ట్రంలో కొత్త సంవత్సర వేళ అత్యధికులు ఒకే సమయంలో సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. ఈ రికార్డుపై ప్రధాని మోడీ (PM Modi) సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు.
రాష్ట్రంలో ప్రసిద్ధ మోధేరా సూర్య దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఏక కాలంలో సామూహిక నమస్కారాలు చేశారు. మొత్తం 108 ప్రాంతాల్లో ఏక కాలంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సింఘ్వి, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 4000 మంది 51 విభిన్న కేటగిరిల్లో సూర్య నమస్కారాలను చేశారు.
అత్యధిక మంది ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడంలో ఇదే తొలి రికార్డ్ అని గిన్నిస్ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘనతపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 2024ను గిన్నీస్ రికార్డుతో గుజరాత్ ప్రభుత్వం స్వాగతించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 వేదికల్లో ఏక కాలంలో సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు.
మన సంస్కృతిలో 108 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పారు. ఐకానిక్ మోధేరా సూర్య దేవాలయం వేదికగా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఇది యోగా, మన సాంస్కృతిక వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాన్ని తమ రోజువారి దినచర్యలో భాగం చేసుకోవాలని కోరారు.