భర్త ఇంటి ఎదుటే భార్య అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు. ఈ ఘటన గుజరాత్(Gujarat)లోని ఛోటా ఉదేపుర్(Chota Udepur)లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? ఛోటా ఉదేపుర్నకు చెందిన కెలిబెన్ వర్షనాభాయ్ రత్వా, వర్షన్భాయ్ భార్యాభర్తలు. వర్షన్భాయ్ ఉదేపుర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
భార్య కెలిబెన్ వర్షనాభాయ్ రత్వా కొద్ది రోజులుగా కనిపించడంలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో డిసెంబర్ 5న గొండారియా గ్రామంలోని అడవిలో ఓ మహిళ మృతదేహం లభ్యం కాగా, అక్కడ లభించిన ఆధారాలతో మృతురాలు కెలిబెన్ వర్షనాభాయ్ రత్వాగా గుర్తించారు. మృతురాలి శరీరంపై దాదాపు 20-25 కత్తిపోట్లు ఉన్నాయి.
దీంతో పోలీసులు ఎవరో హత్య చేసి ఉంటారని ముందుగా భావించారు. విచారణలో మృతురాలి బంధువులు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని చెప్పారు. కెలిబెన్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కెలిబెన్ భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి వర్షన్భాయ్ తానే కెలిబెన్ను హత్య చేశానని ఒప్పుకున్నాడు. వివాహేతర సంబంధానికి భార్య అడ్డు తొలగించుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
దీంతో కుటుంబసభ్యులు ఆగ్రహావేశానికి లోనయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా వర్షన్భాయ్ ఇంటి ఆవరణలోనే కెలిబెన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గురువారం కెలిబెన్ కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భర్త ఇంటి ముందే అంత్యక్రియలు చేశారు.