ఈశాన్య అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలపై తుపాను ప్రభావం కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కురిసిన అకాల వర్షంతో గుజరాత్ (Gujarat) అతలాకుతలమైంది. అక్కడ పిడుగుపాటుతో సుమారు 20మంది మృతిచెందినట్లు సమాచారం.
గుజరాత్‌తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా పలు చోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన రోడ్లతో సహా కాలనీలు జలమయమవుతున్నాయి. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గుజరాత్‌లో పరిస్థితిపై రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు వివరాలు వెల్లడించారు.
గుజరాత్‌లోని మొత్తం 251 తాలూకాల్లో 220 చోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. అకాల వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇక దాహోద్ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపిలో ఇద్దరు మృతి చెందారని వివరించారు. అదేవిధంగా అహ్మదాబాద్, అమ్రేలీ, సూరత్, సురేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడి 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం ఉదయం 6 గంటలకు మొదలైన వర్షం 10 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అహ్మదాబాద్ నగరంలో నిన్న 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. సోమవారం రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రా ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్ మృతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు x వేదికగా సంతాపం ప్రకటించారు.