అగ్రరాజ్యం అమెరికా(USA)లో మరో సారి కాల్పులు కలకలం రేపాయి. ఫిలడెల్ఫియా (Philadelphia)లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. తూర్పు పెన్సిల్వేనియా(Eastern Pennsylvania)లోని ఫాల్స్ టౌన్‌షిప్(Falls Township)లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటన శనివారం జరిగినట్లు ఫిలడెల్ఫియాలోని మిడిల్టన్ టౌన్‌షిప్ పోలీసులు వెల్లడించారు. 26ఏళ్ల యువకుడు పలువురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో ముగ్గురు మృతి చెందినట్లు చెప్పారు. మృతులకు తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. టౌన్ షిప్‌లోని రెండు చోట్ల కాల్పులు జరిగినట్లు ఫాల్స్ టౌన్ షిప్ పోలీసులు తెలిపారు.
ఈ ఘటన అనంతరం నిందితుడు న్యూజెర్సీలోని ఒక ఇంటికి తాళం వేసి ప్రజలను బందీలుగా ఉంచాడని, అనుమానితుడు ఒక వాహనాన్ని దొంగిలించి న్యూజెర్సీలోని ట్రెంటన్‌కు వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. నిందితుడికి బక్స్, ట్రెంటన్‌లోని కొన్ని ఇళ్లతో సంబంధాలు ఉన్నాయని, ప్రధానంగా ట్రెంటన్‌లో నివసిస్తున్నారని మిడిల్టన్ టౌన్ షిప్ పోలీసులు చెబుతున్నారు.
అమెరికాలోని అర్కాన్సాస్‌లో కొద్ది రోజుల కిందట కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ కాల్పుల ఘటన ఓ ప్రైవేట్ పార్టీలో చోటు చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో 70కి పైగా కాల్పుల ఘటనలు నమోదయ్యాయి.