కాంగ్రెస్ పార్టీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే పనిగా పెట్టుకుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutha sukendhar reddy) ఆరోపించారు. నల్గొండ(Nalgonda) జిల్లాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు(Politics) ఎప్పుడూ ఒకలా ఉండవని, తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలతో కొందరు పార్టీ వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారాల్సిన అవసరం తనలాంటి వాళ్లకు లేదని స్పష్టత ఇచ్చారు. ‘పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను కానీ నా కుమారుడు అమిత్ కానీ పోటీలో ఉంటాం.. మూడోసారి కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు’ అని వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ బ్యారేజీ విషయంలోనూ ఇలాగే జరుగుతోందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై అబాండాలు సరికాదని సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కేసీఆర్ విజయానికి అందరూ సహకరించాలని సూచించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు సుఖేందర్‌రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో తనపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కొన్ని కారణాల వల్ల కొందరు ఎమ్మెల్యేలు తనతో విడిపోవచ్చని, అయితే వారి విజయాన్ని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.