వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసే నైజం వామపక్షాలదని బీజేపీ ఎంపీ(BJP MP) జీవీఎల్ నరసింహారావు(GVL Narasimharao) అన్నారు. విశాఖ(Vizag)లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వామపక్ష నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వామపక్ష పార్టీలు చౌకబారు విమర్శలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతిని మర్చిపోయిన కమ్యూనిస్టులు.. చైనా వేడుకలు ఇక్కడ నిర్వహించాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా, నాలుగు రోజులు సంక్రాంతి వేడుకలను నిర్వహించామన్నారు.
ఇవాళ జరగనున్న మహాసంక్రాంతి ముగింపు వేడుకల్లో 10 మందికిపైగా ఎంపీలు హాజరవుతారని తెలిపారు. మహా సంక్రాంతి వేడుకల విరాళాలపై, వామపక్షాల రాజకీయ విమర్శలు తగదని అన్నారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు కొనసాగించాలని హితవుపలికారు.
‘ఛాలెంజ్ చేస్తున్నా.. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపించగలరా? ఎస్బీఐ, సీఎస్సార్ నుంచి రూ.65లక్షల తీసుకోవడంపై సీపీఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనుమరుగైన వామపక్ష పార్టీలవి చౌకబారు విమర్శలు.. ఇలాంటివి మానుకోవాలి’ అని ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు.