హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం (Hamas-Israel war) నేపథ్యంలో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బాంబుల వర్షంతో నిరాశ్రయులైన వారు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. హమాస్‌పై ఇజ్రాయెల్ ఎదురుదాడులకు దిగింది. ఈ క్రమంలో అక్కడ ఐరాస ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలూ దెబ్బతినడంతో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలు కిక్కిరిసిపోవడంతో చాలా మంది శరణార్థులై రోడ్లపైనే నిద్రించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హమాస్‌పై ఇజ్రాయెల్ ఎదురుదాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ఈ చర్యలతో గాజాలో పాలస్తీనియన్ శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన 48 ఐక్యరాజ్య సమితి కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఐరాస యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ(UNRWA) వెల్లడించింది.
హమాస్‌పై సైనిక ఎదురు దాడులు ప్రారంభించాక ఇజ్రాయెల్ ఉత్తర గాజా ప్రాంత ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి దక్షిణ గాజా ప్రాంతానికి వెళ్లాలని గతంలో హెచ్చరికలు జారీ చేసింది. అయితే భీకర యుద్ధంతో గాజాలో సుమారుగా 15లక్షల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. వీరిలో దాదాపు సగం మంది ఐరాస సహాయ కేంద్రాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు.
సహాయ కేంద్రాలు శరణార్థులతో కిక్కిరిసిపోవడం వల్ల దక్షిణ ప్రాంతంలోని ఐరాస సహాయ కేంద్రాల్లో కొత్తవారికి ఆశ్రయం కల్పించలేకపోతున్నామని యూఎన్ఆర్డబ్ల్యూఏ తెలిపింది. దీంతో చాలామంది గాజా వాసులు దిక్కుతోచని స్థిలో రోడ్డుపైనే నిద్రిస్తున్నారు. మరోవైపు, హమాస్‌పై తమ సైనికుల ఎదురుదాడులకు విరామం చెప్పాలంటే బందీలుగా ఉన్న వారిని విడుదల విషయంలో పురోగతి అవసరమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.