ఇజ్రాయెల్ (Israel)-హమాస్ (Hamas) మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించారు. కాల్పుల విమరణ (Cease Fire) ఒప్పందం సోమవారం రాత్రి ముగిసింది. ఈ క్రమంలో కాల్పుల విరమణను మరో రెండు రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు విషయాన్ని ఇజ్రాయెల్-హమాస్ మధ్య మధ్యవర్తిత్వం జరుపుతున్న ఖతార్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
కాల్పుల విరమణ పొడిగింపు అమలులో ఉన్న సమయంలో అదనంగా రోజుకు 10 మంది చొప్పున రెండు రోజుల్లో 20 మంది బందీలను హమాస్ సంస్థ విడుదల చేయాల్సి ఉంది. అటు ఇజ్రాయెల్ సైతం రోజుకు 30 మంది చొప్పున 60 మంది ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. కాల్పుల విరమణ పొడగింపుపై ఐరాస హర్షం వ్యక్తం చేసింది.
యుద్ధపు చీకట్ల నడుమ కనిపించిన ఒక ఆశగా ఈ ఒప్పందాన్ని ఐరాస అభివర్ణించింది. ఈ ఒప్పందం మానవత్వపు మెరుపు లాంటిదని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. ఇది ఇలా వుంటే 11 మంది బందీలను హమాస్ సోమవారం విడుదల చేసింది. వారంతా నిన్న రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నట్టు ఆ దేశ సైన్యం వెల్లడించింది.
హమాస్ చెర నుంచి విడుదలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులతో కలిపే వరకు తాము వారి వెంటే ఉంటామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. మరో వైపు ఇజ్రాయెల్ కూడా 33 మంది పాలస్తీనా ఖైదీల విడుదల చేసింది. ఖైదీలను హమాస్ విడుదల చేసిన కొద్ది సేపటికే తాము 33 మందిని విడుదల చేసినట్టు స్పష్టం చేసింది.