కాంగ్రెస్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు. కృష్ణా జలాల పంపిణీని కేఆర్‌ఎంబీకి అప్పగించటం పూర్తిగా కాంగ్రెస్ (Congress) సర్కార్ చేతగాని తనమని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ పనితీరు బయటపడిందని మండిపడ్డారు. పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.
కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ…. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ జలాల ట్రిబ్యునల్ వివాదం తీర్చేందుకు ప్రధాని మోడీకి తొమ్మిదేండ్లకు పైగా సమయం పట్టిందని వెల్లడించారు.
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా జలాల విషయంలో ఏపీ- తెలంగాణలు తీర్చుకుంటాయని కేంద్రం ఆ విషయంలో తల దూర్చవద్దని కరాకండిగా మాట్లాడి పోరాడారని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనంతో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీటి కోసం కేంద్రం నుంచి అనుమతుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ హక్కుల కోసం మాజీ సీఎం కేసీఆర్ నిరంతరం పోరాడుతూనే ఉన్నారని అన్నారు. గత పదేండ్లలో సాగునీరు, తాగునీరుతో పాటు నాణ్యమైన విద్యుత్ అందించామని వివరించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి తెలంగాణకు అన్ని కష్టాలు తీసకు వస్తోందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువుతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక్క తడి నీటి కోసం కేసీఆర్ కోదాడ నుంచి నాగార్జునసాగర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ పోరాటానికి ప్రభుత్వం తలొగ్గి ఒక పంట నీరు విడుదల చేసిందన్నారు. రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ ఎప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు.