బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ (KCR) పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు (V.Hanumath Rao) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కాళేశ్వరం, మేడిగడ్డలో కేసీఆర్ సర్కార్ అవినీతి బాగోతం బయటపడుతుందనే కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు.
కృష్ణ జలాల అంశంతో ప్రజల దృష్టిని కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీ. హన్మంత రావు మాట్లాడుతూ….. అధికారం కోల్పోయినప్పటికీ కేసీఆర్కు అహంకారం తగ్గలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నల్గొండలో భారీ బహిరంగ సభతో ప్రజలలోకి కేసీఆర్ వెళుతున్నారని పేర్కొన్నారు. గత పదేండ్లలో కేసీఆర్ ఏనాడైనా ప్రజలలోకి వెళ్లాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉంటే ప్రగతిభవన్లో ఉండే వారని లేదంటే ఫాంహౌజ్లో ఉండేవారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలలో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక ప్రస్టేషన్తో సీఎం రేవంత్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎస్ సోమే్షకుమార్ అవినీతి బాగోతంపై దర్యాప్తు జరిపిస్తామని వీహెచ్ అన్నారు.