ఏపీ(AP)లో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ-జనసేన(TDP-Janasena)లు సమష్టిగా వైసీపీ(YCP)పై పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి పొత్తు సఫలమై అధికారంలోకి వస్తే సీఎం పదవి ఎవరికిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
జనసైనికులు పవన్‌కల్యాణ్‌కే సీఎం పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటో జనసైనికులందరికి అర్థమయ్యేలా చెప్పాలని నిలదీశారు. మీ ద్వారా నీతివంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరే చెప్పే సమాధానం ఏంటని ప్రశ్నించారు.
‘‘చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి.. ఈ నిర్ణయంలో రెండో మాటలేదు.. అనుభవస్తుని నాయకత్వమే ఈరాష్ట్రానికి కావాలని పవన్ కళ్యాన్ అనేకసార్లు ప్రకటించారు.. కావున అందరి మాట ఇదే’’ అంటూ లోకేష్ ప్రకటించేశారని, రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో పవన్ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలంటూ జనసేనానికి చురకలంటించారు.
లోకేష్ ఆశిస్తున్నట్లు చంద్రబాబును పూర్తికాలం సీఎం చేయడానికి మీ ఆమోదం ఉందా? అంటూ ప్రశ్నించారు. మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న జనసైనికుల కలలు ఏం కావాలంటూ ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే రెండు కులాల నాయకులు రాజ్యమేలుతున్నారని హరిరామజోగయ్య ఆరోపించారు. 80శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షమెప్పుడు అంటూ ఆయన లేఖ ద్వారా పవన్ ను నిలదీశారు.